ఆకట్టుకునే “అతిథి దేవోభవ”
యంగ్ లవర్ బాయ్ ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి.
కథ: అభయ్ (ఆది సాయి కుమార్)కు పుట్టుకతోనే ‘మోనో ఫోబియా’ అనే సమస్యతో బాధపడుతూ ఉంటాడు. మోనో ఫోబియా ఉంటే ఒంటరితనం భరించలేరు. ఆ భయంలో చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. అందుకే, అభి (అభయ్) ఒంటరిగా ఉండలేడు. ప్రతి క్షణం మరో మనిషి తోడు కోరుకునే అతను వైష్ణవి (నువేక్ష)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అయితే, ఆ ప్రేమకు ఈ మోనో ఫోబియా పెద్ద సమస్య అవుతుంది.
దాంతో తన సమస్యను వైష్ణవికి చెప్పకుండా తనలో తానే బాధపడుతూ ఉంటాడు అభి. మరి చివరకు అభయ్ ఆమెకు అసలు నిజం చెప్పాడా? లేదా? అతని సమస్య విని వైష్ణవి ఎలా రియాక్ట్ అయ్యింది ? చివరకు ఈ జంట ఒక్కటయ్యిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉంది అంటే…
‘మోనో ఫోబియా’ అనే విభిన్న కథాంశంతో వచ్చిన ‘అతిధి దేవోభవ’ చిత్రం ఆకట్టుకుటుంది. సినిమాలో సాంగ్స్, నటీనటుల నటన బాగుంది.నేరేషన్, బోరింగ్ లేకుండా ట్రీట్మెంట్, లాజిక్ ప్లే, మరియు బలమైన కాన్ ఫ్లిక్ట్ తో ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకోవడంతో సినిమాకి ప్లస్ అయ్యాయి. దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. దర్శకుడు కథనం మలచడంలో బాగా స్టడీ చేసి తీశారు. పాత్రలు పరిచయానికి కొంత సమయం తీసుకున్నా… ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మోనో ఫోబియా అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ.. కథనాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మంచి కథా బలంతో చివరి వరకూ దర్శకుడు సింగిల్ ప్లాట్ తోనే సినిమాని నడిపించిన తీరు బాగుంది. దీనికి తోడు ప్రతి పాత్రకి ఒక ఎమోషన్ పెట్టి బలమైన సంఘర్షణతో కథను నడిపించారు. కథలో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపించినా… ఆసక్తిగా వున్నాయి.
ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాలను మనం అంగీకరిస్తే అందరి జీవితాలు సాఫీగా సాగిపోతాయి. అయితే ఈ చిత్రంలో హీరోకి ఒంటరితనం అంటే భయం. ఆ భయమే తన లోపం. మరి తన లోపాన్ని హీరో తన ఫామిలీ మెంబెర్స్, స్నేహితుల సపోర్ట్ తో ఎలా అధిగమించాడు అనేది దర్శకుడు డీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కథని దర్శకత్వం వహించిన దర్శకుడిని,.నిర్మాతలని అభినందించాలి. గతంలో శర్వానంద్ ఓ సీ డి ప్లాట్ తో వచ్చిన చిత్రం “మహానుభావుడు”, మతిమరుపు డిజార్డర్ తో వచ్చిన నాని చిత్రం “భలే భలే మగాడివోయ్” లాంటి చిత్రాలు ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాలే. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆది సాయి కుమార్ “అతిధి దేవోభవ” కూడా అలాంటి కాన్సెప్ట్ తో వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు.
సినిమా మెయిన్ పాయింట్ బాగుంది. ఇందులో కొత్తగా ట్రై చేసిన ఆది సాయి కుమార్ తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ వేరియేషన్స్ లో ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన మార్క్ యాక్టింగ్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు. అలాగే ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోనూ అటు అతి భయంతో వణికి పోయే సందర్భాల్లోనూ ఆది తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ నువేక్ష చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ నువేక్ష నటన చాల బాగుంది. అలాగే తల్లిగా నటించిన రోహిణి నటన, సప్తగిరి నటన పర్వాలేదు. మిగిలిన నటీనటులు కూడా తమకిచ్చిన పాత్రల్లో బాగా నటించారు.
పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. స్క్రిప్ట్ బాగా రాసుకున్నారు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో మెప్పించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాతలు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!
రేటింగ్: 3.25/5