ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు దిలీప్‌రాజా ‘లాక్‌డౌన్’ అనే టైటిల్‌తో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌కు కేంద్ర సెన్సార్ బోర్డ్ ఆమోదం ఇచ్చినట్లుగా ఆయన తెలియజేశారు. గతంలో ప్రముఖ హాస్యనటుడు ఆలీతో ‘పండుగాడి ఫొటోస్టూడియో’ చిత్రానికి దర్శకత్వం వహించిన దిలీప్‌రాజా తాజాగా ‘యూత్’(కుర్రాళ్ళ గుండె చప్పుడు) చిత్రాన్ని ప్రారంభించారు. ఒక షెడ్యూల్ అనంతరం లాక్‌డౌన్ రావడంతో ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చే వరకు ఆ చిత్ర నిర్మాణాన్ని వాయిదా వేశారు. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారతదేశానికి సోకిన అనంతరం జరిగిన పరిణామాలపై వాస్తవిక సంఘటనలు ఆధారంగా ‘లాక్‌డౌన్’ చిత్రం రూపొందిస్తామని దర్శకుడు దిలీప్‌రాజా తెలిపారు.


ఈ సందర్భంగా ‘లాక్‌డౌన్’ చిత్ర విశేషాలను తెలుపుతూ.. ‘‘విజయ్ బోనెల, ప్రదీప్ దోనూపూడి సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ‘లాక్‌డౌన్’ చిత్రంలో వలస కార్మికుడే హీరో. ఆంధ్రప్రదేశ్‌లో ‘లాక్‌డౌన్’ చిత్రం షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాము. కథ విషయానికి వస్తే.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులను స్వగ్రామంలోనే వదిలి భార్యాబిడ్డలతో కూలిపని కోసం ఓ మహానగరానికి చేరుకుంటారు. అక్కడ భార్యబిడ్డలతో పనిచేసుకుంటుండగానే ‘లాక్‌డౌన్’ ప్రకటించడంతో తల్లిదండ్రులను చేరుకునే దారిలేక కాలినడకన బయలుదేరుతారు. నడిచి నడిచి తన బిడ్డల కాళ్లు పగిలిపోయి నెత్తురోడుతుంటాయి. చేతిలో డబ్బుల్లేక, ఆకలికి సమాధానం చెప్పలేక.. రాత్రివేళల్లో వేలాది కిలోమీటర్లు నడుస్తూ.. దారిలో తగిలిన గ్రామాల్లో అడుక్కు తింటూ బయలుదేరిన ఆ వలసకూలీ తన తల్లిదండ్రులను చేరుకుంటాడా? లేదా? అనే అంశాన్ని సినిమాలో చూపిస్తున్నాం. ఒక వైపు కరోనా వైరస్ నుంచి కాపాడుకుంటూ మరోవైపు గమ్యస్థానానికి బయలుదేరిన వలసకూలి బతుకు చిత్రమే ఈ చిత్రం. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతుంది. మరోవైపు పాటల రికార్డింగ్ అవుతున్నాయి. కరోనాపై అప్రమత్తంగా లేకపోతే కరోనా కాటేసి తీరుతుందని ఈ చిత్రంలో చూపిస్తున్నాము. ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలనే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి. భారతదేశంలో ‘లాక్‌డౌన్’ పేరుతో తొలిసారిగా ఈ చిత్రం రూపకల్పన చేస్తున్నాము..’’ అని దిలీప్‌రాజా తెలిపారు.


ఈ సినిమాకు కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: దిలీప్‌రాజా